బెల్లం జిలేబీలు
జిలేబీలు గుల్లగా పాకం పీల్చుకొని చాల బావుంటాయి కదా.. ఈ సారి బెల్లం పాకంతో చేసి చూడండి.
కావలసినవి:
మైదా పిండి 2 కప్పులు
పెరుగు ఒక కప్పు
నూనె రెండు కప్పులు
పాకానికి:
తురిమిన బెల్లం ఒక కప్పు
నీరు ఒక కప్పు
విధానం:
ముందు రోజు రాత్రి పిండి కలిపి ఆ తరువాతి మధ్యాహ్నం వేసుకునేట్టు ప్లాన్ చేసుకోండి.
ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు మైదా, పెరుగు వేసి బాగ సమంగా కలపండి. అవసరమైతె ఇంకొంచెం పెరుగు వేసుకోండి లేదా రెండు చెంచాలు నీళ్ళు (అవసరమైతేనే)పోసుకోండి. గిన్నెకి మూత పెట్టి పక్కన వుంచండి.
మరునాడు మధ్యాహ్నం ముందు పాకం పట్టండి. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి బెల్లం తురుము, నీరు వేసి బాగ కలిపి లేత పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండండి. లేత పాకం వచ్చాక పొయ్యి ఆపి చాల్లరనివ్వండి.
పిండి గిన్నెలో మిగిలిన అర కప్పు మైదా వేసి బాగ కలపండి. ఒక కవర్ తీసుకుని అందులో పిండిని నింపుకోండి. కవర్ పైన మూతి బిగించి కింద (గోరింటాకు కోన్) లాగ నొక్కితె పిండి పడేల చెయ్యండి. మీరు సాస్ బాటిల్ లేద జంతికల గొట్టం కూడ వాడచ్చు. నేను జంతికల గొట్టం వాడాను.
బానలిలో నూనె పోసి కాగాక చిన్న సెగ పై ఉంచి, ఈ పిండి ని గుండ్రంగా చుట్టలుగా వత్తుకోండి. అవి బంగారు రంగు వచ్చే వరకు వేపి తీసి వేడి మీదనే బెల్లం పాకంలో వేయండి. అలా 2 నిముషాలు ఊరనివ్వండి. బయటకు తీసి వడ్డించుకోండి. కమ్మని బెల్లం జిలేబీలు తయార్!